పంట పొలాలను సందర్శించిన ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు
న్యూస్ , 10 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు గ్రామానికి చెందిన వివిధ రైతుల సాగు చేస్తున్న వరి మరియు మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించిన జిల్లా ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్), కరీంనగర్ శాస్త్రవేత్తలు రైతులకు తగు సూచనలు చేశారు.
ఈ క్షేత్ర ప్రదర్శనలో భాగంగా జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతు జిల్లాలో వరి పైరు దుబ్బు చేసే దశ నుండి చిరు పొట్ట దశలో ఉంది. జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్న వరి పంటలో కాండం తొలిచే పురుగు ఆశిస్తుందని తెలియజేశారు. యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నది. కావున వరి పంటలో ఆశించే కాండం తొలిచే పురుగు నివారణ చర్యలను సూచించారు.
కాండం తొలిచే పురుగు : ప్రస్తుతం వరి పంటలో కాండం తొలిచే పురుగు (మొవ్వ చనిపోయే దశ) ఎక్కువగా నష్టపరుస్తుందని గమనించడమైనది.
• పురుగు ఉధృతిని గమనించడానికి దీపపు ఎర, సోలార్ దీపపు ఎర లేదా లింగాకర్షక బుట్టలను అమర్చుకొని రెక్కల పురుగులపై నిఘా పెట్టాలి.
ఎకరాకు 3 లింగాకర్షక బుట్టలను పెట్టి అందులో వారానికి బుట్టకు 25-30 పురుగులు పడినప్పుడు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలను చేపట్టాలి.
• ముఖ్యంగా పురుగు నివారణకు సిఫారసు చేయబడని ఇతర 10జి లేదా సేంద్రియ గుళికలను యూరియాతో కలిపి వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని రైతు సోదరులు గమనించాలి.
. గత 2-3 సంవత్సరాల నుండి యాసంగిలో ఈ పురుగు పిలక దశలో ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. కనుక నాటు వేసిన 15-20 రోజుల తర్వాత ఎకరానికి కార్టాప్ హైడ్రాక్లోరైడ్ 4జి 8 కిలోలు లేదా కార్బోప్యూరాన్ 3సిజి 10 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 4 కిలోలు బురద పదునులో వేయాలి. అలాగే అగ్గి తెగులు సోకిన పంట పొలాల్లో తాత్కాలికంగా యూరియా వేయడం ఆపివేయాలి. తరువాత ఈ తెగులు నివారణకు ఐసోప్రోతయోలిన్ 1.5 మి. లీ. లేదా టేబుకోనజోల్+ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 0.4 గ్రాముల మందిని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే మొక్క జొన్న పంటలో ఆశిస్తున్న కత్తెర పురుగు నివారణకు క్లోరంత్రనిలిప్రోల్ 0.3 మి. లీ. మందుని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఈ క్షేత్ర సందర్శనలో జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా.కె.మదన్ మోహన్ రెడ్డి మరియు శాస్త్రవేత్త డా.ఏం. రాజేంద్ర ప్రసాద్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారిణి కుమారి లలిత మరియు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.